మా  అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు..

botcha-9.jpg

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించార‌ని, అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేద‌ని సూచించారు. ధాన్యం కొనుగోలుపై పరుచూరి బ్రదర్స్‌లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదు, వాస్తవాలు మాట్లాడాలి అంటూ హిత‌వు ప‌లికారు. కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.

తుపాన్ వర్షాలు కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తాము. తగ్గిస్తామని చెప్పి కరెంట్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచింది. ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపింది. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్‌ఈలకు వినతి పత్రం సమర్పిస్తాం.

కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషం. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తాను. లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా?. టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ కోరారు.

Share this post

scroll to top