ఉచిత విద్యుత్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఖండించారు. శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించామని స్పష్టం చేశారు. కానీ భట్టి విక్రమార్క తప్పుడు లెక్కలు చెబుతూ సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మా హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తుల కల్పన చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి కమీషన్ల కోసం పంచుకుతిన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అసలు తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. తమ హయాంలో వడ్లు కొన్నాం.. ఠంచన్‌గా పైసలు ఇచ్చాం. భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.