శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు 41 మంది భక్తులు గాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ టీటీడీ, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని టిటిడి ఛైర్మన్ పదే పదే చెబుతున్నారు. కానీ సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా మారిందో మనం చూశాం. వీఐపీలకు మాత్రం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చాలా విశాలంగా ఉంది. పోలీసులు లేకపోయినట్లయితే ఈ ఘటన జరిగేది కాదు. ఎవరికి వారుగా క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు. భక్తులను పోలీసులు కట్టడి చేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలి అని పేర్కొన్నారు.