ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. లక్కవరంలోనూ పందెం బరులను ధ్వంసం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా జంగారెడ్డి గూడెం డీఎస్పీ కోడి పందెం నిర్వహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోడి పందాలు, గుండాట, కోతాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో కోడిపందాల బరులను పోలీసులు ట్రాక్టర్లతో దున్నించారు. పోలీసులు నిర్వాహకులను పిలిపించి హెచ్చరించారు. కోడిపందాలకు అనుమతులు లేవని కాదని హద్దుమీరితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతేకాదు కోడి పందాలు వద్దు గ్రామీణ క్రీడలే ముద్దు అని పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. అమలాపురం మండలం రోళ్లపాలెం గ్రామంలో కోడి పందాల బరులను ట్రాక్టర్‌తో దున్నించారు.