విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్..

metro-30.jpg

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం, 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

విజయవాడలో 66 కి.మీ, విశాఖపట్నంలో 76.9 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ మెట్రో సిస్టంకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించారు. 2017లో ఆమోదించిన పాలసీ నిబంధనల ప్రకారం, మెట్రో రైలు ప్రాజెక్టు నిధుల వ్యవస్థపై సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రూ.8,565 కోట్లతో అదే పద్ధతుల్లో చేపట్టారని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు మొదటి దశలో పనులు ప్రారంభించనున్నారు. రెండో దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. ఫేజ్-1 కోసం రూ.11,400 కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14,000 కోట్లు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల ద్వారా నగరాల ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న నాలుగేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Share this post

scroll to top