నూతన రేషన్ కార్డుల కోసం మీసేవ నుంచి దరఖాస్తు చేయాలని సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు, కుల గణనలో వివరాలు తీసుకున్నారు, గ్రామ సభల పేరిట డ్రామా చేశారు, ఇప్పుడు మళ్లీ మీ సేవలో దరఖాస్తు అంటున్నారని మండిపడ్డారు.
పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా? అని నిలదీశారు. ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారని, జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.