జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాళ్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్‌పై ఉంటారు. వాహనాల పార్కింగ్‌కి ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.