కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అవినీతి..

kalyani-06.jpg

రాష్ట్రంలో మహిళలకు వృత్తినైపూణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఓబీసీ, కాపుమహిళలకు కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో రూ.157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ శిక్షణ సంస్థలను కాదని, కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్దంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం కేటాయించిన సొమ్మును సైతం కాజేస్తోందని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో తినుకో పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారికి ఎన్నికల హమీల్లో ఇచ్చిన వాటిని ఏ ఒక్కటీ నేటికీ అమలు చేయడం లేదు. ఈ రోజు తల్లికివందనం, మహాశక్తి, ఉచిత బస్సు, కళ్యాణమస్తు, పండుగ కానుకలు వంటి స్కీంలు ఎక్కడా అమలు చేయడం లేదు. ఇప్పుడు మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ కోసం నిర్ధేశించిన స్కీంలోనూ అవినీతికి పాల్పడ్డారు. మొదటి విడతలో రూ.157 కోట్లు దోపిడీకి ప్లాన్ చేశారు. మొత్తంగా రూ. 254 కోట్లను యాబై రోజుల్లో దోచుకునేందుకు సిద్దమయ్యారు. కుట్టుమిషన్ ట్రైనింగ్ అంటూ కుంభకోణంకు పాల్పడ్డారు. మహిళలకు ఇచ్చే కుట్టుమిషన్లు, దాని శిక్షణ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోచుకునేందుకు సిద్దపడ్డారు.

Share this post

scroll to top