ఇండియా దాడులను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణుల దాడులతో పాటు ఫేక్ ప్రచారం కూడా మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, నకిలీ పోస్టులు, పాత వీడియోలతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్‌పై దాడులు చేశామంటూ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అంతర్జాతీయంగా పరువుపోగొట్టుకుంటోంది. అయితే పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఆధారాలతో సహా పాక్ ఫేక్ ప్రచారాన్ని బయటపెడుతోంది. పాక్ కంటెంట్‌పై భారత్‌లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై మిస్సైల్ తో దాడి చేసినట్లు కూడా పాకిస్థాన్ ఫేక్ వీడియో ప్రచారం చేస్తోంది. దాన్ని కూడా పీఐబీ ఫేక్ అని తేల్చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై ఎలాంటి మిస్సైల్ దాడి జరగలేదని స్పష్టం చేసింది.
S 400 భారత్ అమ్ములపొదిలో సుదర్శన చక్రం ఇది. పాకిస్తాన్ విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేస్తున్న పాశుపతాస్త్రం ఇది. యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు ఈ S400. ఒకేసారి 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచడంతోపాటు ఏకకాలంలో 36 టార్గెట్స్‌ను ధ్వంసం చేయగలదు. అలాంటి S400ని ధ్వంసం చేసేసినట్టు తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. ఇండియన్ యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ S400ను కూల్చేసినట్టు ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేసింది పీఐబీ. S400కి ఏమీకాలేదని, సమర్ధవంతంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను నేలకూల్చుతోందని ప్రకటించింది.