దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన ప్రజా నాయకుడు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు. వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గుర్తుచేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన మరణం అత్యంత విషాదమన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఉండేది కాదని.. కష్టాలు,కన్నీళ్లు ఉండేవి కావని రాహుల్ తెలిపారు.
తండ్రి వారసత్వాన్ని కూతురు షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తారని.. ఆ నమ్మకం తనకు బలంగా ఉందని స్పష్టం చేశారు. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానన్నారు. తాను వ్యక్తిగతంగా వైఎస్సార్ నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఆయన పాదయాత్ర తన జోడో యాత్రకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. నాడు రాజశేఖర్‌రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఆయనే తనకు స్ఫూర్తి అన్నారు. నేడు 75వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.