రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం వాయిదా పడింది. తదుపరి తేదీలను ఇరు రాష్ట్రాలతో చర్చి్ంచి వెల్లడిస్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు, ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉన్న ఈ సమావేశం వాయిదా పడటంతో మరికొంత కాలం విభజన సమస్యలపై ప్రతిష్టంభన కొనసాగనుంది.