పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఏపీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని 2014 ఏపీ పునర్వివిభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. పదేళ్ల తర్వాత ఏపీ తమ రాజధానిని ఏర్పాటు చేసుకుంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి ముందుకు వెళ్లింది. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు తమ విధానమని ముందుకు వెళ్లడంతో 2019 నుంచి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగింది.
అమరావతి ఏకైక రాజధాని విధానంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను రీలాంచ్ చేసింది. ప్రధాని పర్యటనకు ముందు రాజధాని రైతులు సీఎం చంద్రబాబును కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు, ఈ అంశంపై కేంద్రంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కేంద్రాన్ని కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది.