వైసీపీకి చెందిన కొందరు నేతలు పార్టీ మారతారని వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు కానీ ప్రజాదరణ పొందలేదు. ఇది చారిత్రక సత్యం’ అని అంబటి రాంబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్వలాభం కోసమే వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అటువంటి వారి వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. పార్టీని వీడుతున్న నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, గతంలో ఇలా పార్టీలు మారిన నాయకులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని చెప్పుకొచ్చారు. ఇటువంటి మోసపూరిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులను కొనడం చంద్రబాబు నాయుడికు అలవాటని చెప్పారు. 2014లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నారని అన్నారు. ఆ తర్వాత 2019లో చంద్రబాబు 23 సీట్లకే పరిమితమయ్యారని చెప్పారు.
వైసీపీని వీడుతున్న కీలక నేతలపై కాకాణి, అంబటి ఫైర్..
