ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతోపాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణంగా అందిస్తారు. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో.. గరిష్ఠంగా ముగ్గురికి అందిస్తారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన యూనిట్‌కి, కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్‌లకు కూడా రుణాలు ఇస్తారు. కొత్తవారికి మాత్రమే కాదు ఇప్పటికే ఏదైనా జీవనోపాది పొందుతున్నవారికి సైతం లోన్స్ ఇస్తారు. లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే.. ఈ రుణాన్ని రూ 10 లక్షలు కూడా పెంచుతామని ప్రభుత్వం తెలిపింది.