రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రైతులకు విద్యుత్ అనేది ఎంతో ముఖ్యం. పంట పండించడంలో కీలక భూమిక పోషించేది విద్యుతే. సకాలంలో పంటకు నీరందించాలంటే విద్యుత్ కనెక్షన్ మస్ట్. కాబట్టి ఈ విషయంలో చంద్రన్న సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానంలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోయేలా ప్లాన్ రెడీ చేసింది.
రైతులు ఇకపై సచివాలయం, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదని, కేవలం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే మీకు విద్యుత్ కనెక్షన్ రిజిస్టేషన్, మంజూరు ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో తొలుతగా ఈపీడీసీఎల్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 1912 కాల్ సెంటర్‌లో కొంతమంది సిబ్బంది ప్రత్యేకం విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెంబర్ కి రైతులు కాల్ చేసి తన భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెప్పిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్ మంజూరు ప్రక్రియ మొదలవుతుంది.