ఏపీకి ఇప్పటిలో వర్షాలు వీడే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అయితే ఎన్నడు లేని విధంగా కుండపోత వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే ఆ భారీ వర్షాల, వరదల నుంచి ప్రజలు కొలుకుంటున్న లోపు మరోసారి వాతవరణ శాఖ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తాజాగా వాతవరణ శాఖ ప్రకటించింది. అలాగే ఈ అల్పపీడనం 28వ తేదీకి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం, తుపానుగా బలపడుతుందని వాతవరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీఏ తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది.