తుపాను తీరందాటి రెండ్రోజులవుతున్నా ఏపీని వర్షాలు వీడటం లేదు. తీరందాటిన తుపాను వాయుగుండంగా బలహీన పడుతుండగా ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో, ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురవగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి నీరు చేరింది. బస్టాండ్ కూడలి, కర్నూల్ రోడ్డులో భారీగా వర్షపునీరు నిలిచింది. రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి పెరిగింది. దేవళంపేట వెదురుకుప్పం ప్రధాన రహదారిపై మద్దెలవంక ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. జలాశయం కలుజు పారుతుండటంతో వాగుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరువాన కురవడంతో పలు కాలనీల్లో నీళ్లు నిలిచాయి. చీరాల, బాపట్ల, వేటపాలెం, చినగంజాం, రేపల్లె, మేదరమెట్ల, అద్దంకి లో భారీ వర్షం కురిసింది.