రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ కళ్యాణ్ నిర్వహించారు. అలాగే, ఎన్డీయే కూటమి పొత్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఇవాళ మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో.. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
