చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్ జగన్ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు. సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు.