గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూడటం అంటే ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని విమర్శించారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు.
ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలన్నారు. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోవాలన్నారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.