ఏపీలో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీల్లో ఒకటైన, ముఖ్యమైన నూతన రేషన్ కార్డుల జారిపై అడుగులు ముందు వేసింది. కొత్త రేషన్ కార్డులను ఎప్పడు ఇస్తారనే దానిపై జరుగుతున్న చర్చలకు సీఎం చంద్రబాబు తెర దింపారు. సంక్రాంతి కానుకగా అర్హులకు రేషన్ కార్డులను అందించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులో కోసం ప్రజల నుంచి వచ్చే నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న, ప్రస్తుతం అమలు చేసిన పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు ఉండడం తప్పనిసరి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలన్నా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్నా దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా రేషన్ కార్డు ఉండడం ఖచ్చితం. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని అధికారులు ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తారు. రేషన్ కార్డు ఉన్నవారే ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారు కొత్త కార్డుల మంజూరు చేయడంతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది కూటమి ప్రభుత్వం.