ఏటా నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే టీటీడీలో ఎప్పటి నుంచో అమలవుతున్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి దేవాన్ష్ తరఫున భారీగా విరాళం ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో గత రెండేళ్లు వరుసగా 33 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చిన చంద్రబాబు ఇవాళ దాన్ని 44 లక్షలకు పెంచేశారు. ఈ మేరకు ఆయన టీటీడీకి చెక్కు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబు ఇలా 33 లక్షల నుంచి 44 లక్షలకు విరాళం పెంచి ఇవ్వడంలో మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ నిత్యాన్నదాన పథకంలో ఒక్క రోజు అన్న ప్రసాదం విలువ గతంలో రూ.33 లక్షలుగా ఉండేది. అది కాస్తా పెరిగిన ధరలతో రూ.44 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఇలా తన మనవడు నారా దేవాన్ష్ పేరుతో ఇవాళ రూ.44 లక్షల విరాళం అందించారు. తద్వారా టీటీడీలో ఒక్కరోజు అన్నదానానికి తమ వంతుగా సాయం చేసినట్లు అయింది. నారా దేవాన్ష్ పేరిట చంద్రబాబు ఇచ్చిన విరాళం వివరాల్ని తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.