ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా ఉంటోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు కలిసిన వారిలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రోడ్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు.
అదే సమయంలో ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామితోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో చంద్రబాబు వెంట కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, లోక్‌సభ సభ్యులు భరత్, లావు కృష్ణదేవరాయలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఉన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుమారస్వామితో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్టీల్ ఫ్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు.