ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక హామీ విషయంలో ఇప్పటికే మోసం జరిగిందని రాజకీయ విమర్శలు వినిపిస్తుండగా .. తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చా మొదలైంది. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు!. ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి నిమ్మలరామానాయుడు స్వయంగా ఒక ఇంటి దగ్గరికి వెళ్లి.. ఆ ఇంట్లో పిల్లలను చూపిస్తూ.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు.. అంటూ ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందని లెక్కలు సైతం చెప్పారాయన. కానీ, పథకం విధివిధానాల ప్రకారం.. ఒక్కో తల్లికి రూ.15,000 మాత్రమే ఆర్థిక సహాయం అంటూ మెలిక పెట్టారు. జీవో 29 ప్రకారం.. ఒక ఇంట్లో ఆధార్ కార్డు ఆధారంగా (ఆధార్ లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని.. అది వచ్చేలోపు పది రకాల కార్డుల్ని అనుమతిస్తామని చెప్పారు) తల్లులకు తల్లికి వందనం వర్తింపజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఒక ఇంటికి రూ.15వేలు.. ఇంట్లో ఒక్కరికే వర్తింపజేయడమన్నమాట. అలాగే.. వైట్ రేషన్‌కార్డు లబ్ధిదారులకే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
చంద్రబాబు మార్క్ మోసం.. తల్లికి వందనంతో పిల్లిమొగ్గలు!
