ఒకప్పుడు ఆ నది చరిత్ర ఎంతో ఘనం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్మించిన ఆ నది నీరు, సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. దాంతో హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కల్గిన అది నేడు కాలుష్యమయంగా మారి, దుర్గంధం వెదజల్లుతోంది. అదే మూసీ నది. మూడేళ్లలో మూసీని థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తాం. విశ్వనగరానికి ప్రతీకగా, ప్రపంచ స్థాయిలో మూసీని తీర్చిదిద్దుతాం అంటూ మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటిదేనని తేలిపోయింది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా చెప్పుకుంటూ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ బీరాలు పోయింది. ఖర్చు చేసుడు దేవుడెరుగు కనీసం మూసీ కేటాయింపుల్లోనే అత్తెసరు నిధులతో లెక్కలు చూపించింది. ఇక లెక్కలు తేలి, పనులు మొదలుపెట్టాలంటే బారెడు ఖర్చతో కూడుకున్న మూసీ సుందరీకరణ మూరెడు నిధులతో ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేటాయించిన రూ. 1500 కోట్లు 56కిలోమీటర్ల విస్తరించి ఉన్న భూసేకరణకు కూడా సరిపోయేలా లేవని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
మురికిమయంగా మారిన మూసీ నది..
