విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతానికే కాకుండా, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అది రాష్ట్ర సెంటిమెంట్ తో ముడి పడి ఉందని, 32 మంది బలిదానాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో కృషి చేశారన్న ఆయన, ఆ ప్లాంట్ కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అంత ప్రాధాన్యత ఉన్న స్టీల్ ప్లాంట్ ను 2008లో వైయస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ఉన్నప్పుడు సుమారు రూ.11 వేల కోట్లతో కంపెనీని విస్తరించారని బొత్స చెప్పారు.
అలాంటి పరిశ్రమను ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతున్నారన్న మండలి విపక్షనేత, ఒకరి మీద ఒకరు నిందించుకోవడానికి ఇది సందర్భం కాదని, గతంలో ఆ పరిశ్రమను ఎలా కాపాడుకున్నారో ఆలోచించాలని అన్నారు. గతంలో కూడా ఇలా ప్రైవేటీకరణ దిశలో ఆలోచించినప్పుడు, నాటి సీఎం వైయస్ జగన్, చాలా స్పష్టంగా చెప్పారని, ఇక్కడికి వచ్చి వీఎస్ పీ కార్మిక సంఘాల నాయకులను కలిసి మాట్లాడారని, కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.