గతంలో వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరగగా అదంతా జగన్ పనే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా తన కుమారుడు జగనే ఆ పని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను అడ్డుపెట్టుకుని నీచ, నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు.
ఈ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. భయపడి తాను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య అని అన్నారు.