ఏపీలో తాజాగా భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. విజయవాడతో పాటు ఇతర జిల్లాల్లోనూ బారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకూ భారీగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద తాజాగా ఏపీలో వరదల కారణంగా రూ.6882 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు శాఖల వారీగా జరిగిన నష్టంపై తయారు చేసిన నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్రంలో తాజా వరదల్లో అత్యధికంగా రోడ్లు భవనాల శాఖ 2 వేల కోట్లకు పైగా నష్టపోయింది. జలవనరుల శాఖ 1500 కోట్లు, మున్సిపల్ శాఖ వెయ్యి కోట్లు, రెవెన్యూ శాఖ 750 కోట్లు, విద్యుత్ శాఖ 480 కోట్లు, వ్యవసాయశాఖ 300 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 167 కోట్లు నష్టపోయాయి. అలాగే మత్సశాఖ 157 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ 75 కోట్లు, ఉద్యానశాఖ 40 కోట్లు, పశుసంవర్ధక శాఖ 11 కోట్లు నష్టపోయాయి. ఇలా మొత్తం మీద దాదాపు 7 వేల కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు.