ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో భయానక పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగిపోయి ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా దాడులు తీవ్రమవుతున్నాయి. కొన్నాళ్లు ఓపికతో సహించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాట బాట పట్టారు. వినుకొండలో రషీద్ హత్యపై ఆగ్రహంతో ఉన్న జగన్ తాజాగా గవర్నర్‌ను కలిశారు. ఏపీలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. మా పార్టీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. హత్యలు, దాడులు, అకృత్యాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ దిశలోనే ఇన్ని రోజుల టీడీపీ కూటమి పాలన సాగింది’ అని వైఎస్ జగన్ వినతిపత్రంలో తెలిపారు. ’36 మంది హత్య. 300 మందిపై హత్యాయత్నాలు. టీడీపీ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. యథేచ్ఛగా 1050కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 2,700 కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లిపోయాయి’ అని వినతిపత్రంలో వైఎస్ జగన్ వివరించారు.
అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు. చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ.. ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నాం.