ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతన అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.
నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైయస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.