శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీసిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు. విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ, ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన కొన్నింటికి భూకేటాయింపులు జరిగాయని, ఇప్పుడు వాటన్నింటినీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండున్నర ఏళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్నా, 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్ నిర్వహించి, 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామన్న గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంవోయూలకు సాక్ష్యాలని తేల్చి చెప్పారు.