ఆధారాల్లేకుండా అరెస్టులా..

high-court-7.jpg

పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. 

ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. 

Share this post

scroll to top