అనంతపురం జిల్లా తాడిపత్రి లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తానని ప్రకటించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అవాంచిత ఘటనలు జరిగే అవకాశం ఉన్నదని, తాడిపత్రికి రావద్దని చెప్పారు.
అంతేగాక యల్లనూరు మండలం తిమ్మంపల్లి లోని కేతిరెడ్డి నివాసంలో ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండని చెప్పి, గృహ నిర్భందం చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో పోలీసులు భారీగా చేరుకున్నారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, ఎటువంటి గొడవలకు తావు ఇవ్వకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జేపీ ప్రభాకర్ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇక గృహ నిర్భందంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు తాడిపత్రిలో ఉన్న నా ఇంటికి నన్ను వెళ్లనివ్వడం లేదని, తాడిపత్రికి వెళ్లాలంటే వీసా తీసుకొని వెళ్లాలా అని ప్రశ్నించారు.