ఏపీ ప్రభుత్వం గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హామీల అమల్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని అన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే హామీల అమలుపై గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ కేతిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అద్భుతాలెన్నీ అప్పుడే జరుగుతాయని అనుకోకూడదు. ఈ ఏడాది ఆఖరి వరకూ ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. సంపద సృష్టించి ఇస్తామన్నారు. ఆ సంపద సృష్టించేందుకు వారికి సమయం ఇవ్వాలి. సంపద సృష్టించిన తర్వాత హామీల అమలు గురించి అడగాలి. అలాగే ప్రభుత్వం అనేది పాలన చేయాలి కానీ.. వ్యాపారం చేయకూడదు. ఇసుక, మద్యం వ్యాపారాలు ప్రభుత్వం కాకుండా థర్డ్ పార్టీ చేయాలి. ఈ రెండూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పులు. వీటి వల్లనే చెడ్డపేరు మూటగట్టుకున్నామనే అపవాదు ఉంది.మేము చేసిన తప్పులే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇక హామీల అమలు గురించి కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. రెండు నెలలకే గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు” అని వెంకట్రామిరెడ్డి అన్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
