ఏపీకి మరో వర్ష గండం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతుందని, రానున్న మూడ్రోజుల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ.
నవంబర్ 8,9,10 తేదీల్లో ఉత్తరకోస్తా, యానాంలలోని ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 8,9 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 10వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు, ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.