చైనా పేరు వార్తల్లో వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. కారణం మరో ప్రమాదకర వైరస్ అవును కోవిడ్ -19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కొత్తగా పుట్టుకొచ్చిన హ్యుమన్మోటాన్యూమో వైరస్‌తో చైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తోన్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొత్త వైరస్ విషయంపై అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.