వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాలను ప్రొత్సహించవద్దన్నారు పవన్ కల్యాణ్. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను వదులుకోవడానికి కూడా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించాల్సి ఉందని.. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని మరోసారి వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తాను మర్చిపోనని అన్నారు. అయితే నామినేటేడ్ పోస్టులను టీడీపీ, బీజేపీతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. సోమవారం ప్రజాప్రతినిధులను సత్కరించిన పవన్ కల్యాణ్.. ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది కూటమి విజయమని.. కూటమి పార్టీలో ఎవరినీ కించపరచొద్దన్నారు. సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నారు. కుటుంబ రాజకీయాలు వద్దు.. వారసులను తేవొద్దు.. వారసులు వస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందంటూ పవన్ పేర్కొన్నారు. క్రమశిక్షణారాహిత్యంతో తనకు తలపోటు తీసుకురావద్దని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కుటుంబసభ్యులను పిలవొద్దని .. పదవులు ఉన్నా లేకున్నా పనిచేయాలని పవన్‌కల్యాణ్ తెలిపారు.
ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు.. ఎవరినీ కించపరచొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
