శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా వైసీపీలోనే కొనసాగుతా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వెనక్కి వచ్చారు. టీడీపీ నేతలు తనను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారని, ఇతనకు ఇష్టం లేకున్నా పార్టీ కండువా కప్పారని భారతి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారని, తనకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారని పేర్కొన్నారు. పదవి కంటే పార్టీ ముఖ్యం అని, వైసీపీలోనే కొనసాగుతా అని భారతి స్పష్టం చేశారు.
మే 19న రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ ఉప ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. అయితే ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా కప్పారు. భారతి టీడీపీలో చేరినట్లు పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోవడంతో వైసీపీ నేతలే ఆమెను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. విషయం తెలిసిన భారతి.. ఆ వార్తలను ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బంధువుల ఇంట్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు.