హైడ్రా కు రాజకీయ పార్టీలు బ్రేకులు..

hidra-27.jpg

హైడ్రా బుల్‌ డోజర్ కు రాజకీయ పార్టీలు బ్రేకులు వేసేటట్లే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే ఒక వైపు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపుగా పరిస్థితి మారింది. గత నెలరోజుల నుంచి హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేస్తుంది. ఇందులో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సామాన్యులు మాత్రం ఎవరూ లేరు. ఇక అక్రమంగా నిర్మించిన తమ కట్టడాలను ఎక్కడ కూల్చివేస్తారోనని బిల్డర్లకు కూడా భయం పట్టుకుంది. అన్నీ వెరసి రాజకీయ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తున్నాయి.

హైడ్రా ఇప్పటి వరకూ పద్దెనిమిది చోట్ల కూల్చివేతలను చేపట్టింది. దీంతో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను ఆక్రమించి పెద్దపెద్ద భవంతులను కట్టారు. అయితే ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా మిగిలి ఉంది. అనేక ఫాం హౌస్ లో ఎఫ్‌ టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. బఫర్ జోన్ ను ఆక్రమించి మరీ బడాబాబులు నిర్మాణాలు చేపట్టారు. కేవలం ఫాం హౌస్ లు మాత్రమే కాదు మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారు. వారు ముందుగానే జాగ్రత్త పడి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే లు తెచ్చుకుంటున్నారు. దీంతో వాటి జోలికి వెళ్లడానికి బుల్ డోజర్ కు బ్రేకులు పడినట్లయింది.

Share this post

scroll to top