తొలుత లీకులు ఆపై బ్రేకులు..

cbn-18-.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది. ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనేది కొత్తేమీ కాదు. మంచినీళ్లు తాగినంత సులువు. ఎలాంటి నిర్ణయాలనైనా సకాలంలో తీసుకునే మేధస్సు ఆయన సొంతం. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పరి. 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగారంటే చంద్రబాబు రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు ఇప్పుడు చతికిలపడినట్టే కనిపిస్తోంది. చేష్టలుడిగినట్టయ్యారని అంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదనిపిస్తోంది పరిశీలకులకు. దీనికి కారణాలు, ఉదాహరణలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లో యూటర్న్‌లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ చెబుతున్న వారు చాలామందే ఉన్నారు. ఉచిత ఇసుక విధానం మొదలుకుని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకూ ఇదే తతంగం కనిపిస్తోంది.

Share this post

scroll to top