ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఏపీ యువనేస్తం స్కీమ్ అని పిలుస్తున్నారు. దీని కింద నెలకు రూ.3,000 చొప్పున ఇస్తారని తెలిసినా, ఇంతవరకూ దీన్ని ప్రారంభించలేదు. ఐతే ఏపీలో నిరుద్యోగులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో నిరుద్యోగ భృతి అమలు అనేది తప్పనిసరి అంశంగా ఉంది. మరి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విద్యార్థులకు నెలవారీ సాయం పథకంలో భాగంగా రూ.1000 చొప్పున ఇవ్వడం ప్రారంభించారు. ఈ పథకాన్ని తమిళ్ పుధల్వాన్ (కొడుకు) స్కీమ్ అని పిలుస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇంటర్ పాసైన నిరుద్యోగులు నెలకు రూ.6,000 పొందుతారు. అలాగే డిప్లొమా చేసిన వారు నెలకు రూ.8,000 పొందుతారు. డిగ్రీ పాసైన వారు నెలకు రూ.10,000 స్టైపెండ్ కింద పొందుతున్నారు. ఇది నిరుద్యోగ భృతి లాంటిదే. కాకపోతే, ఇందులో మనీ ఇవ్వడంతోపాటూ నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. తద్వారా నిరుద్యోగులు తగిన ఉద్యోగం పొందేందుకు అర్హతలు సాధించగలుగుతారు.