ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొద్ది రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు వీల్లేదంటూ ఎమ్మెల్యే బడేటి చంటి వర్గీయులు వ్యతిరేకించారు. కాగా, నాని సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల మధ్య మంగళవారం ఎమ్మెల్యే బడేటి చంటి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందన తెలియజేయడంతో ఆళ్ల నానికి లైన్ క్లియర్ అయింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ బాబు సమక్షంలో నాని టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని స్పష్టమైంది.