అక్రమ మైనింగ్ వ్యవహారంలో గన్నవరం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సోమవారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే, వైసీపీ సర్కార్ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు గన్నవరం మండలాల పరిధిలో వంశీతో పాటు అతడి అనుచరులు అక్రమ మైనింగ్‌తో రూ.195 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూఠీ చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణలో వెల్లడైంది.
గనుల శాఖ ఎండీ ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీపై ఈనెల 14న కేసు నమోదు చేశారు. సోమవారం వాదనల సందర్భంగా వంశీ తరఫు న్యాయవాది శ్రీరామ్ మాట్లాడుతూ తన క్లయింట్ పై అర్ధరాత్రి కేసు నమోదు చేశారని, ప్రతి కేసులోనూ MMDR యాక్ట్ చేర్చడం సరికాదన్నారు. అదేవిధంగా సత్యవర్థన్ కిడ్నాప్, ఫేక్ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులను తిరిగి తోడి అక్రమంగా వంశీని అరెస్ట్ చేశారని వాదించారు. దీంతో స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వంశీపై కేసు నమోదు విషయంలో చట్ట పరంగా అన్ని నిబంధనలు పాటించామని అన్నారు. ఫేక్ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ A1గా ఉన్నాడని తెలిపారు. అయిత, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అతడి చార్జిషీట్లో పేరు చేర్చకుండా పిటిషనర్ దర్యాప్తు అధికారిని ప్రభావితం చేశారని కోర్టుుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.