ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కన్నీటి సుడులతో ముంపు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా బాధితులు బయటకు వస్తున్నారు. పాలు, మందులు, నిత్యావసర సరుకుల కోసం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులను ఎత్తుకున్న తల్లులు, వృద్ధులను భుజాలకు ఎత్తుకుని మరికొందరు, వికలాంగులను మోసుకుని కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు పడుతున్న అవస్థలు వర్ణానాతీతం. ఇలా వందలాది మంది బయటకు రావడంతో ముంపునకు సమీపంలోని ప్రాంతాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి.
వరద తాకిడితో తల్లడిల్లుతున్న బాధితులపై కూటమి సర్కారు కనీస కనికరం చూపడంలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ముంపు బాధితులు నరకయాతన పడుతున్నారు. మూడు రోజులుగా వరద నీటిలో అల్లాడిన ప్రజలు.. మంగళవారం కొంతమేర ముంపు నీరు తగ్గడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. పీకల్లోతు నీటిని సైతం లెక్కచేయక కర్రల ఊతంతో ముంపు నుంచి ఒడ్డుకు చేరే సాహసం చేశారు. సర్వస్వాన్ని ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతోనే వారంతా పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో ముంపు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రధానంగా మూడు కిలోమీటర్ల పొడవైన సింగ్‌నగర్ ఫ్లయ్‌ఓవర్ సైతం వరద బాధితులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుంటే.. మరికొందరు నిత్యావసర సరుకులు కొనుక్కుని మళ్లీ ముంపులోని ఇళ్లకు చేరుతున్నారు.