మళ్లీ రాజ్యసభకు సాయిరెడ్డి..

sai-reddy-11.jpg

వైసీపీకి రాజీనామా చేసే సమయంలోనే సాయిరెడ్డి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం సాగింది. కాగా, సాయిరెడ్డి తాన ఏ పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాయిరెడ్డి బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతల్లోనే ఈ చర్చ మొదలైంది. ఏపీలో సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తిరిగి బీజేపీ నుంచి సాయిరెడ్డికే కేటాయించనున్నట్లు చెబుతున్నారు. సాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి దక్కేలా ఇప్పటికే కూటమిలో నిర్ణయం జరిగింది. వైసీపీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి ఎన్నికైన విధంగానే సాయిరెడ్డి విషయంలో జరగనుందని ఢిల్లీలోని బీజేపీ నేతల సమాచారం. అయితే, సాయిరెడ్డి కూటమి పార్టీల్లో చేరిక పైన టీడీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.

కూటమి లో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆయన రాక పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. వైసీపీలో నెంబర్ టూగా తమ ను ఇబ్బంది పెట్టిన సాయిరెడ్డికి అవకాశం ఇవ్వ ద్దని సూచించినట్లు అప్పట్లోనే బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు. దీంతో, కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకునే విధంగా సాయిరెడ్డి ముందుగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పుడు రాజ్యసభ సీటు భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సమయంలో బీజేపీ తిరిగి సాయిరెడ్డికే అవకాశం ఇవ్వనుందని భావిస్తున్నారు. అయితే సాయిరెడ్డి బీజేపీలో చేరటం ద్వారా ఏపీలో భవిష్యత్ రాజకీయాల పైన ఆ పార్టీ నేతలు స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి సాయిరెడ్డి బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్తారా లేక, రాజకీయాలకు దూరంగానే ఉంటారా అనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.

Share this post

scroll to top