విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. నేడు విశాఖకు ప్రధాని మోదీ వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. స్టీల్ ప్లాంట్ కోసం ఉక్కు కార్మికులు నిరాహర దీక్ష చేస్తున్నా కనీసం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నేడు విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు.
విశాఖ స్టీల్‌పాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ఎకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమారాస్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని, సెయిల్‌లో విలీనం చేయిస్తామని, సొంత గనులు కేటాయిస్తామని, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద రూ.18వేల కోట్లు మంజూరు చేయించి చర్యలు చేపడతామని చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన బల్లెంలా పెట్టటానికి తహతహలాడుతున్నారని మండిపడ్డారు.