అధికారంలో ఉండగా వీరావేశం ప్రదర్శించారు. తోటి నాయకులపై తొడకొట్టారు. తమకు ఎదురు లేదని, ఎవరూ పోటీ రారని బీరాలు పలికారు. అధి నాయకుల మెప్పుకోసం మీసాలు మెలేశారు. అధికారం పోయింది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో అడ్రస్ లేరు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేసుల భయంతో ఇతర ప్రాంతాలకు వెలుతున్న నేతలు కోర్టుల ద్వారా ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, యువజన విభాగం కోఆర్డినేటర్ పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఇలా చెప్పుకుంటే పోతే ఎంతో మంది నేతలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
అజ్ఞాతంలోకి నేతలు అయోమయంలో శ్రేణులు..
