టీడీపీ పెద్దలకు కూడా హిట్లర్‌ లాంటి గతే పడుతుంది..

lakshmi-08.jpg

ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని లక్ష్మీపార్వతి అన్నారు. హామీల అమలుపై ప్రశ్నిసతే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియా కార్యకర్తలను అర్ధరాత్రి ఇంటికెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. పాలన చేతగాక చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అన్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని ఆరోపించారు.

వాస్తవానికి మహిళలపై టీడీపీ వాళ్లే దారుణమైన పోస్టులు పెడుతున్నారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పోస్టుల వల్లే తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హిట్లర్‌ లాంటి వ్యక్తే దిక్కుమొక్కు లేకుండా చనిపోయారని టీడీపీ పెద్దలకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని విమర్శించారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియా వల్లే చంద్రబాబు చేస్తున్న అవినీతి బయటపడుతుందని తెలిపారు. తమపైనా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టారని తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తనను బూచిగా చూపించారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో ఎన్టీఆర్‌ను కించపరుస్తూ వేసిన కార్టూన్లను మీడియాకు చూపించారు. ఇప్పుడు విజయమ్మ రాసిన లేఖను కూడా ఫేక్‌ అని టీడీపీ ట్విట్టర్‌లో పెట్టారని అన్నారు. చివరకు విజయమ్మ వీడియో చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఇంత దరిద్రపు పాలనను ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.

Share this post

scroll to top