మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్ మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు.
సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్ఆర్ సతీమణి విజయమ్మ, తనయుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, వైయస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైయస్ఆర్ సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.