చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్..

rambabu-31-.jpg

కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘పీ4-జీరో పావర్టీ’ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్‌ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి-బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్ట్ కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తోందని అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను దోచుకుని బాగుపడుతున్న బంగారు కుటుంబాలు ఏవయ్యా అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కుటుంబాలే జ్ఞాపకం వస్తున్నాయని ధ్వజమెత్తారు. 

ఉగాది రోజు చాలా ఆర్భాటంగా శాసనసభ సమీపంలో పీ4-జీరో పావర్టీ, ‘మార్గదర్శీ-బంగారు కుటుంబం పేరుతో సీఎం చంద్రబాబు సుదీర్ఘమైన సమావేశం నిర్వహించారు. పీ4 కాన్సెప్ట్ అద్భుతమైనదని, ఏపీలో పేదరిక నిర్మూలకు ఇది దోహదపడుతుందని, ఇది తన ఆలోచనల నుంచే పుట్టిందని చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు రోడ్లపై కొత్త టోల్‌గేట్లు పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను, గ్రామీణ రహదారులను కూడా పీ4 పేరుతో ప్రైవేటీకరిస్తున్నారు. వీటి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో 58 ప్రభుత్వరంగ కార్పోరేషన్‌లను ప్రైవేటీకరించిన ఘనత చంద్రబాబుదే. మొత్తం వ్యవస్థను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు పాలన సాగుతోంది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్ అన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతాను అన్నారు. పదినెలలు అవుతోంది, సంపద సృష్టి లేదు, ఇప్పుడు ధనవంతులను తీసుకువచ్చి, వారిని పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నాడు.

పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధులను మెరుగుపరచడం, ఉచిత విద్య, వైద్యం, వారికి పని కల్పించడం. ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిని గత ప్రభుత్వంలో వైయస్ జగన్  అమలు చేసి చూపించారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతగా పేదలను ఆర్థిక స్వావలంభన దిశగా నడిపించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారే తప్ప చంద్రబాబులా ఆ బాధ్యత నుంచి పారిపోయే కార్యక్రమం చేయలేదు. 

Share this post

scroll to top